Link to home pageLanguagesLink to all Bible versions on this site
27
దహన బలిపీఠం
1 “నీవు తుమ్మచెక్కతో ఐదు మూరల పొడవు ఐదు మూరల వెడల్పు గల బలిపీఠం చెయ్యాలి. ఆ బలిపీఠం నలుచదరంగా ఉండాలి. దాని యెత్తు మూడు మూరలు. 2 దాని నాలుగు మూలలా దానికి కొమ్ములు చెయ్యాలి. దాని కొమ్ములు దానితో ఏకాండంగా ఉండాలి. దానికి ఇత్తడి రేకు పొదిగించాలి. 3 దాని బూడిద ఎత్తడానికి కుండలను, గరిటెలను, గిన్నెలను, ముళ్ళను, అగ్నిపాత్రలను చెయ్యాలి. ఈ ఉపకారణాలన్నిటినీ ఇత్తడితో చెయ్యాలి.

4 దానికి వలలాంటి ఇత్తడి జల్లెడ చెయ్యాలి. 5 ఆ వల మీద దాని నాలుగు మూలలా నాలుగు ఇత్తడి రింగులు చేసి ఆ వల బలిపీఠం మధ్యకి చేరేలా కిందిభాగంలో బలిపీఠం గట్టు కింద దాన్ని ఉంచాలి. 6 బలిపీఠం కోసం మోతకర్రలను చెయ్యాలి. ఆ మోతకర్రలను తుమ్మచెక్కతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగించాలి. 7 ఆ మోతకర్రలను ఆ రింగుల్లో చొప్పించాలి. బలిపీఠం మోయడానికి ఆ మోతకర్రలు దాని రెండువైపులా ఉండాలి. 8 పలకలతో గుల్లగా దాన్ని చెయ్యాలి. కొండ మీద నీకు చూపించిన నమూనా ప్రకారం దాన్ని చెయ్యాలి.

ఆవరణం తెరలు
నిర్గ 38:9-20

9 నీవు మందిరానికి ఆవరణం ఏర్పాటు చెయ్యాలి. కుడివైపున, అంటే దక్షిణ దిక్కున ఆవరణం నూరు మూరల పొడవు ఉండాలి. పేనిన సన్న నార తెరలు ఒక వైపుకు ఉండాలి. 10 దాని ఇరవై స్తంభాలు, వాటి ఇరవై దిమ్మలు ఇత్తడివి. ఆ స్తంభాల కొక్కేలు, వాటి పెండెబద్దలు వెండివి. 11 అలాగే పొడవులో ఉత్తర దిక్కున నూరు మూరల పొడవు గల తెరలు ఉండాలి. దాని ఇరవై స్తంభాలు, వాటి ఇరవై దిమ్మలు ఇత్తడివి. ఆ స్తంభాల కొక్కేలు, వాటి పెండెబద్దలు వెండివి. 12 పడమటి దిక్కున ఆవరణం వెడల్పులో ఏభై మూరల తెరలు ఉండాలి. వాటి స్తంభాలు పది. వాటి దిమ్మలు పది. 13 తూర్పు వైపున, అంటే తూర్పు దిక్కున ఆవరణం వెడల్పు ఏభై మూరలు. 14 ఒక వైపు పదిహేను మూరల తెరలుండాలి. వాటి స్తంభాలు మూడు, వాటి దిమ్మలు మూడు. 15 రెండవ వైపు పదిహేను మూరల తెరలుండాలి. వాటి స్తంభాలు మూడు, వాటి దిమ్మలు మూడు. 16 ఆవరణ ద్వారానికి నీల ధూమ్ర రక్త వర్ణాల తెరలు ఇరవై మూడు ఉండాలి. అవి పేనిన సన్ననారతో కళాకారుని పనిగా ఉండాలి. వాటి స్తంభాలు నాలుగు, వాటి దిమ్మలు నాలుగు. 17 ఆవరణం చుట్టూ ఉన్న స్తంభాలన్నీ వెండి పెండెబద్దలు కలవి. వాటి కొక్కేలు వెండివి. వాటి దిమ్మలు ఇత్తడివి. 18 ఆవరణం పొడవు నూరు మూరలు. దాని వెడల్పు ఏభై మూరలు. దాని ఎత్తు ఐదు మూరలు. అవి పేనిన సన్ననారతో చేశారు. వాటి దిమ్మలు ఇత్తడివి. 19 మందిరంలో వాడే ఉపకరణాలన్నీ ఆవరణపు మేకులన్నీ ఇత్తడివై యుండాలి.

దీపాల కోసం నూనె
లేవీ 24:1-4

20 దీపం నిత్యం వెలుగుతుండేలా ప్రమిదలకు దంచి తీసిన స్వచ్ఛమైన ఒలీవల నూనె తేవాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు. 21 సాక్ష్యపు మందసం ఎదుట ఉన్న తెర బయట ప్రత్యక్ష గుడారంలో అహరోను, అతని కుమారులు సాయంకాలం మొదలు ఉదయం దాకా యెహోవా సన్నిధిలో దాన్ని సవరిస్తూ ఉండాలి. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరాల వరకూ నిత్య శాసనం.”

<- నిర్గమకాండం 26నిర్గమకాండం 28 ->