3 యెహోవా ఇశ్రాయేలు ప్రజల పట్ల ఐగుప్తీయులకు కనికరం కలిగేలా చేశాడు. అంతేకాక ఐగుప్తు దేశవాసులు, ఫరో సేవకులు మోషేను చాలా గొప్పగా ఎంచారు. 4 మోషే ఫరోతో ఇలా అన్నాడు “యెహోవా చెప్పింది ఏమిటంటే, అర్థరాత్రి నేను బయలుదేరి ఐగుప్తు దేశంలోకి వెళ్తాను. 5 ఐగుప్తు దేశంలో మొదట పుట్టిన సంతానమంతా చనిపోతారు. సింహాసనంపై ఉన్న ఫరో మొదటి సంతానం మొదలుకుని తిరగలి విసిరే పనిమనిషి మొదట పుట్టిన సంతానం దాకా, పశువుల్లో కూడా మొదట పుట్టినవన్నీ చనిపోతాయి.
6 అప్పుడు ఐగుప్తు దేశంలో ప్రతి చోటా గొప్ప విలాపం ఉంటుంది. అలాంటి ఏడుపు ఇంతవరకూ ఎన్నడూ పుట్టలేదు, ఇకపై ఎన్నడూ పుట్టదు. 7 యెహోవా ఐగుప్తీయుల నుండి ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేకపరుస్తాడని మీరు తెలుసుకొనేలా ఇశ్రాయేలు ప్రజలపై గానీ జంతువులపై గానీ ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కరి మీదా కుక్క అయినా నాలుక ఆడించదు. 8 అప్పుడు నీ సేవకులైన వీరంతా నా దగ్గరికి వస్తారు. నా ఎదుట సాష్టాంగపడి, ‘నువ్వు, నిన్ను అనుసరించే వాళ్ళంతా ఈ దేశం విడిచి బయలుదేరండి’ అని చెబుతారు. అప్పుడు నేను నా ప్రజలతో వెళ్ళిపోతాను” అని చెప్పి మోషే మండిపడుతూ ఫరో దగ్గరనుండి వెళ్ళిపోయాడు.
9 అప్పుడు యెహోవా “ఐగుప్తు దేశంలో నేను చేసే అద్భుత క్రియలు అధికం అయ్యేలా ఫరో మీ మాట వినడు” అని మోషేతో చెప్పాడు. 10 మోషే అహరోనులు ఫరో సమక్షంలో ఈ అద్భుతాలు చేశారు. అయినప్పటికీ యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేశాడు. అతడు ఇశ్రాయేలు ప్రజలను తన దేశం నుండి వెళ్ళనియ్యలేదు.
<- నిర్గమకాండం 10నిర్గమకాండం 12 ->