Link to home pageLanguagesLink to all Bible versions on this site
10
పది ఆజ్ఞల మొదటి పలకల వంటిది
1 అప్పుడు యెహోవా “నువ్వు మొదటి పలకల వంటివి రెండు రాతిపలకలు చెక్కి, కొండ ఎక్కి నా దగ్గరికి రా. అలాగే చెక్కతో ఒక పెట్టె చేసుకో. 2 నువ్వు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలను నేను ఈ పలకల మీద రాసిన తరవాత వాటిని నువ్వు ఆ పెట్టెలో ఉంచాలి” అని నాతో చెప్పాడు. 3 కాబట్టి నేను తుమ్మకర్రతో ఒక పెట్టె చేయించి మొదటి పలకలవంటి రెండు రాతి పలకలను చెక్కి వాటిని పట్టుకుని కొండ ఎక్కాను. 4 మీరు సమావేశమైన రోజున ఆయన ఆ కొండ మీద అగ్నిలో నుండి మీతో పలికిన పది ఆజ్ఞలనూ మొదట రాసినట్టే ఆ పలకల మీద రాశాడు. యెహోవా వాటిని నాకిచ్చిన తరువాత నేను కొండ దిగి వచ్చి 5 నేను చేసిన మందసంలో ఆ పలకలు ఉంచాను. అదుగో, యెహోవా నాకాజ్ఞాపించినట్టు వాటిని దానిలో ఉంచాను.

6 ఇశ్రాయేలు ప్రజలు యహకానీయుల[a]కు చెందిన బెయేరోతు నుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అహరోను చనిపోయాడు. అక్కడ అతణ్ణి సమాధి చేశారు. అతని కొడుకు ఎలియాజరు అతని స్థానంలో యాజకుడయ్యాడు. 7 అక్కడ నుండి వారు గుద్గోదకు, గుద్గోద నుండి నీటివాగులతో నిండి ఉండే యొత్బాతా ప్రాంతానికి ప్రయాణమయ్యారు. 8 అప్పటి వరకూ జరుగుతున్నట్టు యెహోవా నిబంధన మందసాన్ని మోయడానికి, యెహోవా సన్నిధిలో నిలబడి సేవించడానికి, ప్రజలను ఆయన పేరిట దీవించడానికి ఆ సమయంలో యెహోవా లేవీ గోత్రం వారిని ఎన్నుకున్నాడు. 9 అందుకే లేవీయులు తమ సోదరులతో పాటు స్వాస్థ్యం పొందలేదు. మీ దేవుడైన యెహోవా వారితో చెప్పినట్టు వారి స్వాస్థ్యం ఆయనే.

10 ఇంతకు ముందులాగా నేను నలభై పగళ్లు, నలభై రాత్రులు కొండ మీద ఉన్నప్పుడు యెహోవా నా మనవి ఆలకించి మిమ్మల్ని నాశనం చేయడం మానుకున్నాడు. 11 యెహోవా నాతో “ఈ ప్రజలు నేను వారి పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలో ప్రవేశించి స్వాధీనం చేసుకొనేలా వారికి ముందుగా నడువు” అని చెప్పాడు.

దేవుడైన యెహోవాకు భయపడుడి
12 కాబట్టి ఇశ్రాయేలూ, మీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గాల్లో నడుస్తూ, ఆయన్ని ప్రేమించి, మీ పూర్ణ మనస్సుతో, మీ పూర్ణాత్మతో సేవించు.

13 మీ మేలు కోసం ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే యెహోవా ఆజ్ఞలను, కట్టడలను పాటించడం తప్ప మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఇంకేమి కోరుతున్నాడు?

14 చూడు, ఆకాశ మహాకాశాలు, భూమి, వాటిలో ఉన్నదంతా మీ దేవుడైన యెహోవావే. 15 అయితే యెహోవా మీ పూర్వీకులను ప్రేమించి వారి విషయంలో సంతోషించి వారి సంతానమైన మిమ్మల్ని మిగిలిన ప్రజలందరిలో ఈ రోజు ఏర్పాటు చేసుకున్నాడు.

16 కాబట్టి మీరు మూర్ఖంగా ప్రవర్తించకుండా సున్నతి లేని మీ హృదయాలకు సున్నతి చేసుకోండి. 17 ఎందుకంటే మీ దేవుడు యెహోవా దేవుళ్లకే దేవుడు, ప్రభువులకే ప్రభువు. ఆయనే మహా దేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన మానవులెవరినీ లక్ష్య పెట్టడు. లంచం పుచ్చుకోడు. 18 ఆయన అనాథలకు, విధవరాళ్ళకు న్యాయం తీరుస్తాడు, పరదేశుల మీద దయ చూపి వారికి అన్నవస్త్రాలు అనుగ్రహిస్తాడు.

19 మీరు ఐగుప్తు దేశంలో ప్రవాసులుగా ఉన్నవారే కాబట్టి పరదేశి పట్ల జాలి చూపండి. 20 మీ దేవుడైన యెహోవాకు భయపడి, ఆయన్ను సేవించి, ఆయన్నే హత్తుకుని, ఆయన పేరటే ప్రమాణం చేయండి. 21 ఆయనే మీ స్తుతికి పాత్రుడు. మీరు కళ్ళారా చూస్తుండగా భీకరమైన గొప్ప కార్యాలు మీ కోసం చేసిన మీ దేవుడు ఆయనే. 22 మీ పూర్వీకులు 70 మంది గుంపుగా ఐగుప్తుకు వెళ్ళారు. ఇప్పుడైతే మీ యెహోవా దేవుడు ఆకాశనక్షత్రాల్లాగా మిమ్మల్ని విస్తరింపజేశాడు.

<- ద్వితీయోపదేశ కాండము 9ద్వితీయోపదేశ కాండము 11 ->