Link to home pageLanguagesLink to all Bible versions on this site
10
దానియేలుకు దర్శనం
1 పారసీకరాజు కోరెషు పరిపాలన కాలంలో మూడవ సంవత్సరంలో బెల్తెషాజరు అనే దానియేలుకు ఒక సంగతి వెల్లడి అయింది. గొప్ప యుద్ధం జరుగుతుంది అనే ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించాడు. అది ఆ దర్శనం వలన అతనికి తెలిసింది.

2 ఆ రోజుల్లో దానియేలు అనే నేను మూడు వారాలు దుఃఖంలో మునిగి పోయాను. 3 మూడు వారాలు గడిచే దాకా నేను సంతోషంగా భోజనం చేయలేకపోయాను. మాంసం తినలేదు. ద్రాక్షారసం తాగ లేదు. స్నానం, నూనె రాసుకోవడం చేయలేదు. 4 మొదటి నెల ఇరవై నాలుగవ తేది నేను హిద్దెకెలు అనే మహా నది తీరాన ఉన్నాను.

5 నేను కళ్ళెత్తి చూడగా, నారబట్టలు ధరించుకున్న ఒకడు కనిపించాడు. అతడు నడుముకు మేలిమి బంగారు నడికట్టు కట్టుకుని ఉన్నాడు. 6 అతని శరీరం కెంపు వర్ణంలో ఉంది. అతని ముఖం మెరుపులాగా ఉంది. అతని కళ్ళు జ్వాలామయమైన దీపాలు, అతని భుజాలు, పాదాలు తళతళలాడే ఇత్తడిలాగా ఉన్నాయి. అతని మాటల ధ్వని గొప్ప జనఘోష లాగా ఉంది.

7 దానియేలు అనే నాకు ఈ దర్శనం కలిగినప్పుడు నాతో ఉన్న మనుషులు దాన్ని చూడలేదు గానీ భయంతో గడగడా వణుకుతూ దాక్కోవాలని పారిపోయారు. 8 నేను ఒంటరిగా ఆ గొప్ప దర్శనాన్ని చూశాను. అందువల్ల నాలో బలమేమీ లేకపోయింది. నా సొగసు వికారమై పోయింది. నాలో బలమేమీ లేకపోయింది. 9 నేను అతని మాటలు విన్నాను. నేను అతని మాటలు విని నేలపై సాష్టాంగపడి గాఢనిద్ర పోయాను.

10 అప్పుడొకడు నన్ను చేత్తో తాకి నా మోకాళ్లను అరచేతులను నేలపై మోపి నన్ను నిలబెట్టి 11 “దానియేలూ, నువ్వు చాలా ఇష్టమైన వాడివి గనక నేను నీ దగ్గరికి పంపబడ్డాను. నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పే మాటలు తెలుసుకో” అన్నాడు. అతడీ మాటలు నాతో చెప్పగా నేను వణకుతూ నిలబడ్డాను.

12 అప్పుడతడు “దానియేలూ, భయపడకు. నీవు తెలుసుకోవాలని నీ మనస్సు లగ్నం చేసి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న ఆ మొదటి రోజు మొదలు నీవు చెప్పిన మాటలు వినబడినాయి గనక నీ మాటలను బట్టి నేను వచ్చాను. 13 పారసీకుల రాజ్యాధిపతి 20 రోజులు నాకు అడ్డుపడ్డాడు. ఇంకా పారసీక రాజుల దగ్గర నేను ఆగిపోయి ఉండగా ప్రధానాధిపతుల్లో మిఖాయేలు అనే ఒకడు నాకు సహాయం చేయడానికి వచ్చాడు.

14 ఈ దర్శనం సంగతి ఇంక చాలా రోజుల వరకూ జరగదు. అయితే చివరి రోజుల్లో నీ ప్రజలకు సంభవించబోయే ఈ సంగతి నీకు తెలియజేయడానికి వచ్చాను” అని అతడు నాతో చెప్పాడు.

15 అతడీ మాటలు నాతో చెప్పగా నేను నా ముఖం నేలకు వంచుకుని మౌనంగా ఉండిపోయాను. 16 అప్పుడు మనిషి ఆకారం గల ఒకడు నా పెదాలు ముట్టుకున్నాడు. నేను నోరు తెరిచి నా ఎదుట నిలబడి ఉన్నవాడితో ఇలా అన్నాను. “అయ్యా, ఈ దర్శనం వలన నాకు వేదన కలిగినందువల్ల నా బలం ఉడిగి పోయింది. 17 తమరి సేవకుడినైన నేను నా యజమాని ఎదుట ఎలా మాటలాడతాను? నా బలం ఉడిగి పోయింది. ఊపిరాడకుండా ఉంది” అని చెప్పగా 18 అతడు మళ్ళీ నన్ను ముట్టి నన్ను బలపరచి “నీవు చాలా ఇష్టమైన వాడివి. భయపడకు. 19 నీకు శుభం కలుగుతుంది. ధైర్యం తెచ్చుకో. ధైర్యం తెచ్చుకో” అని నాతో అన్నాడు.

అతడు నాతో ఇలా అన్నప్పుడు నేను ధైర్యం తెచ్చుకుని “నీవు నన్ను ధైర్యపరచావు గనక నా యజమానివైన నీవు ఆజ్ఞ ఇవ్వు” అని చెప్పాను. 20 అతడు “నేనెందుకు నీ దగ్గరికి వచ్చానో నీకు తెలిసింది గదా. నేను పారసీక అధిపతితో యుద్ధం చేయడానికి మళ్ళీ వెళతాను. నేను బయలు దేరుతున్నప్పుడే గ్రీకుల అధిపతి వస్తాడు. 21 అయితే సత్యగ్రంథంలో రాసినది నీతో చెప్తాను. మీ అధిపతి మిఖాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షంగా నిలబడడానికి తెగించిన వారెవరూ లేరు.”

<- దానియేలు 9దానియేలు 11 ->