Link to home pageLanguagesLink to all Bible versions on this site
3
దేవునితో ఇశ్రాయేలుకు ఉన్న సంబంధం
1 ఇశ్రాయేలీయులారా! యెహోవా మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఐగుప్తుదేశం నుంచి ఆయన రప్పించిన వంశమంతటి గురించి ఆయన తెలియజేసిన మాట వినండి.
2 లోకంలోని వంశాలన్నిటిలో
మిమ్మల్ని మాత్రమే నేను ఎన్నుకున్నాను.
కాబట్టి మీ పాపాలన్నిటికీ
మిమ్మల్ని శిక్షిస్తాను.

3 సమ్మతించకుండా ఇద్దరు కలిసి నడుస్తారా?

ఏమీ దొరకకుండానే సింహం అడవిలో గర్జిస్తుందా?
4 దేన్నీ పట్టుకోకుండానే
కొదమ సింహం గుహలోనుంచి గుర్రుమంటుందా?

5 నేల మీద ఎర పెట్టకపోతే పిట్ట ఉరిలో చిక్కుకుంటుందా?

ఉరిలో ఏదీ చిక్కకపోతే
ఉరి పెట్టేవాడు వదిలేసి వెళతాడా?
6 పట్టణంలో బాకానాదం వినబడితే
ప్రజలు భయపడరా?
యెహోవా పంపకుండా
పట్టణంలో విపత్తు వస్తుందా?
7 తన సేవకులైన ప్రవక్తలకు తన ఆలోచనలను తెలియచేయకుండా కచ్చితంగా యెహోవా ప్రభువు ఏదీ చేయడు.
8 సింహం గర్జించింది.
భయపడని వాడెవడు?
యెహోవా ప్రభువు చెప్పాడు.
ప్రవచించని వాడెవడు?

9 అష్డోదు రాజ భవనాల్లో ప్రకటించండి.

ఐగుప్తుదేశపు రాజ భవనాల్లో ప్రకటించండి.
వాళ్ళతో ఇలా చెప్పండి,
“మీరు సమరయ పర్వతాల మీద సమావేశమై
దానిలోని గందరగోళాన్ని చూడండి.
అక్కడ జరిగే దౌర్జన్యాన్ని చూడండి.
10 సరైనదాన్ని ఎలా చేయాలో వారికి తెలియదు.”
యెహోవా ప్రకటించేది ఇదే.
వాళ్ళు తమ రాజ భవనాల్లో దౌర్జన్యం,
నాశనం దాచుకున్నారు.

11 కాబట్టి యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే,

శత్రువు ఆ ప్రాంతాన్ని చుట్టుముడతాడు.
అతడు నీకు పట్టున్న వాటిని పడగొడతాడు.
నీ రాజ భవనాలను దోచుకుంటాడు.

12 యెహోవా చెప్పేదేమిటంటే,

“సింహం నోట్లో నుంచి
కేవలం రెండు కాళ్ళు గానీ
చెవి ముక్క గానీ
కాపరి విడిపించేలాగా
సమరయలో నివసించే ఇశ్రాయేలీయులను కాపాడతాను.
కేవలం మంచం మూల,
లేకపోతే దుప్పటి ముక్కను కాపాడతాను.”

13 యాకోబు ఇంటి వారికి విరోధంగా ఇది విని ప్రకటించండి.

యెహోవా ప్రభువు, సేనల దేవుడు చెప్పేదేమిటంటే,
14 “ఇశ్రాయేలు పాపాలను నేను శిక్షించే రోజు,
బేతేలులోని బలిపీఠాలను కూడా నేను శిక్షిస్తాను.
బలిపీఠం కొమ్ములు విరిగిపోయి నేలరాలతాయి.

15 చలికాలపు భవనాలనూ

వేసవికాలపు భవనాలనూ నేను నాశనం చేస్తాను.
ఏనుగు దంతంతో కట్టిన ఇళ్ళు నాశనమవుతాయి.
పెద్ద భవనాలు అంతరించిపోతాయి.”
యెహోవా ప్రకటించేది ఇదే.

<- ఆమోసు 2ఆమోసు 4 ->