Link to home pageLanguagesLink to all Bible versions on this site

1 యెహోవా చెప్పేదేమిటంటే

“మోయాబు మూడు సార్లు, నాలుగు సార్లు
చేసిన పాపాలను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను.
ఎందుకంటే వారు ఎదోమురాజు ఎముకలను
కాల్చి సున్నం చేశారు.

2 మోయాబు మీద నేను అగ్ని పంపిస్తాను.

అది కెరీయోతు ప్రాకారాలను కాల్చేస్తుంది.
యుద్ధ ధ్వనులూ బాకానాదం వినబడుతుంటే
మోయాబు హాహాకారాలు చేస్తూ అంతరించి పోతుంది.

3 దానిలోని న్యాయమూర్తిని నిర్మూలం చేస్తాను.

అతనితోపాటు వారి అధిపతులందరిని నేను చంపేస్తాను” అని యెహోవా చెబుతున్నాడు.

4 యెహోవా చెప్పేదేమిటంటే

“యూదా మూడు సార్లు,
నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి
నేను తప్పకుండా వారిని శిక్షిస్తాను.
ఎందుకంటే వారు తమ పూర్వీకులు అనుసరించిన వారి అబద్ధాల వలన మోసపోయి
యెహోవా ధర్మశాస్త్రాన్ని విసర్జించి,
ఆయన విధులను గైకొనలేదు.

5 యూదా మీద నేను అగ్ని పంపిస్తాను.

అది యెరూషలేము రాజ భవనాలను కాల్చేస్తుంది.”
ఇశ్రాయేలకు వ్యతిరేకంగా ప్రవచనం
6 యెహోవా తెలియజేసేది ఏంటంటే
“ఇశ్రాయేలు మూడు సార్లు
నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి
నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను.
ఎందుకంటే డబ్బు కోసం వాళ్ళు నిర్దోషులను అమ్మేశారు.
చెప్పుల కోసం పేదలను అమ్మేశారు.

7 నేల మీద మట్టిని ప్రజలు తొక్కేసినట్టు

దిక్కులేనివారి తలలను తొక్కేస్తున్నారు.
అణగారిన వారిని అవతలికి గెంటేస్తున్నారు.
తండ్రి, కొడుకు ఒకే స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకుని
నా పవిత్ర నామాన్ని అవమానపరుస్తున్నారు.

8 తాకట్టుగా ఉంచిన బట్టలను అప్పగించకుండాా

ప్రతి బలిపీఠం దగ్గర వాటి మీద పడుకుంటారు.
జుల్మానా సొమ్ముతో కొన్న ద్రాక్షమద్యాన్ని
తమ దేవుని మందిరంలో తాగుతారు.

9 దేవదారు చెట్టంత ఎత్తయిన వారూ

సింధూర వృక్షమంత బలమున్న అమోరీయులను
వారి ముందు నిలవకుండా నేను నాశనం చేశాను గదా!
పైన వారి ఫలాన్నీ కింద వారి వేరులనూ
నేను నాశనం చేశాను గదా!

10 ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని రప్పించి,

అమోరీయుల దేశాన్ని మీకు స్వాధీనం చేయాలని
నలభై ఏళ్ళు అరణ్యంలో మిమ్మల్ని నడిపించాను.

11 మీ కొడుకుల్లో ప్రవక్తలను నియమించాను.

మీ యువకుల్లో నాజీరులను ఎన్నుకున్నాను.
ఇశ్రాయేలీయులారా, ఇది నిజం కాదా?”
యెహోవా వెల్లడించేది ఇదే.

12 “అయితే నాజీరులకు మీరు ద్రాక్షమద్యం తాగించారు.

ప్రవచించ వద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చారు.

13 చూడండి. ధాన్యంతో నిండిన బండి

ఎవరినైనా అణిచి తొక్కగలిగినట్టు
నేను మిమ్మల్ని అణగదొక్కుతాను.

14 చురుకైన వారు సైతం తప్పించుకోలేరు.

బలమైనవారు తమ బలాన్నిబట్టి ధైర్యం తెచ్చుకోలేకపోతారు.
గొప్ప వీరుడు కూడా తన ప్రాణం కాపాడుకోలేడు.

15 విలుకాడు నిలబడలేడు.

వేగంగా పరుగెత్తగలిగేవాడు తప్పించుకోలేడు.
రౌతు తన ప్రాణాన్ని కాపాడుకోలేడు.
16 ఆ రోజు అత్యంత ధైర్యండే శూరులు కూడా
నగ్నంగా పారిపోతారు.
యెహోవా ప్రకటించేది ఇదే.”

<- ఆమోసు 1ఆమోసు 3 ->