Link to home pageLanguagesLink to all Bible versions on this site
2
యెహోవా దినం. పాతక పురుషుడు
1 సోదరులారా, ఇకపోతే ప్రసాదించే కృప మూలంగా మన ప్రభువైన యేసు క్రీస్తు రాక గురించీ, మనమంతా ఆయన దగ్గర సమకూడడం గురించీ ఒక విన్నపం. 2 క్రీస్తు రాక జరిగిపోయిందని ఎవరైనా తనకు ఆత్మ వెల్లడించాడని గానీ, ఒక మనిషి మాట చేత గానీ, లేదా మేము రాసినట్టుగా ఏదైనా ఉత్తరం చేత గానీ మీకు తెలిస్తే తొందరపడి యేసు ప్రభువు వచ్చేశాడని నమ్మి మీ మనసుల్లో కలవరపడవద్దని మిమ్మల్ని బతిమాలుతున్నాను.

3 ఏ విధంగానూ ఎవరూ మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. మొదట అనేకమంది దేవునిపై తిరుగుబాటు చెయ్యాలి. వారు దేవునికి వ్యతిరేకంగా ఘోర పాపం జరిగించే ఒకణ్ణి అంగీకరించి వాడికి లోబడతారు. వీడే నాశన పుత్రుడు. వీడు బయట పడేంతవరకూ ఆ రోజు రాదు. 4 వీడు దేవుడు అనబడే ప్రతి దానినీ, లేక పూజలందుకునే ప్రతి దానినీ ధిక్కరిస్తాడు. దానంతటికీ పైగా తనను హెచ్చించుకుంటాడు. తానే దేవుడినని చూపించుకుంటూ దేవుని ఆలయంలో తిష్ట వేస్తాడు.

5 మీ దగ్గర నేను ఉన్నప్పుడు ఈ విషయాలను గూర్చి మీకు చెప్పింది జ్ఞాపకం లేదా? 6 వాడు సరైన సమయంలో బయట పడతాడు. వాడిని ఇప్పుడు బయట పడకుండా అడ్డగిస్తున్నది ఏదో మీకు తెలుసు. 7 అక్రమ పురుషుడి మర్మం ఇప్పటికే పని చేస్తూ ఉంది. ఇప్పటి వరకూ దాన్ని అడ్డుకొనే వాణ్ణి దేవుడు తొలగించే వరకే అడ్డగిస్తాడు. 8 అప్పుడు ఆ అక్రమ పురుషుడు బయటపడతాడు. ప్రభు యేసు తన నోటి శ్వాస చేత వాణ్ణి సంహరిస్తాడు. తన ఆగమన తేజస్సుతో నాశనం చేస్తాడు. 9 సాతాను సమస్త శక్తీ, వాడి కపట సూచక క్రియల, అద్భుతాల ద్వారా అక్రమ పురుషుడు బయట పడతాడు. నశిస్తున్న వారి మధ్య నీతి రాహిత్యమైన అన్ని మోసాలతో వాడు తనను వెల్లడి చేసుకుంటాడు.

10 ఎందుకంటే వారు రక్షణ పొందేలా సత్యాన్ని ప్రేమించలేదు, అంగీకరించలేదు. 11 ఈ కారణం చేత సత్యాన్ని నమ్మకుండా అక్రమంలోనే సంతోషించే వారిని శిక్షించడానికి 12 అబద్ధాన్ని నమ్మేలా భ్రమింపజేసే దాన్ని దేవుడు వారి మధ్యకు పంపిస్తున్నాడు.

హెచ్చరికలు, సూచనలు
13 అయితే ప్రభువు ప్రేమించిన సోదరులారా, మేము మీ కోసం ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే సత్యాన్ని నమ్మడం ద్వారా, పరిశుద్ధాత్మ చేసే శుద్ధీకరణ ద్వారా రక్షణ పొందడానికి దేవుడు మిమ్మల్ని తొలిపంటగా ఎంచుకున్నాడు. 14 మేము ప్రకటించిన సువార్త ద్వారా మన ప్రభువైన యేసు క్రీస్తు మహిమలో పాల్గొనేలా మిమ్మల్ని పిలిచాడు.

15 కాబట్టి సోదరులారా, స్థిరంగా ఉండండి. మా నోటి మాట చేతా, మా పత్రికల చేతా మేము ఉపదేశించిన విధివిధానాలను పాటించండి. 16 ఇప్పుడు మనలను ప్రేమించి శాశ్వత ఆదరణ, కృప ద్వారా భవిష్యత్తు విషయంలో మంచి ఆశాభావం అనుగ్రహించిన 17 మన ప్రభు యేసు క్రీస్తు, తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని ప్రోత్సాహ పరచు గాక. మంచి పనులు చేయడానికి, మంచి మాటలు పలకడానికి మిమ్మల్ని సిద్ధ పరచు గాక.

<- తెస్సలోనీకయులకు రాసిన రెండవ పత్రిక 1తెస్సలోనీకయులకు రాసిన రెండవ పత్రిక 3 ->