Link to home pageLanguagesLink to all Bible versions on this site
5
ఇశ్రాయేలీయులకు రాజుగా దావీదు
5:1-3; 1దిన 11:1-3

1 ఇశ్రాయేలీయుల అన్ని గోత్రాలవారు హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరికి వచ్చారు. వారు “రాజా, విను. మేమంతా నీకు దగ్గర బంధువులం. 2 గతంలో సౌలు మాపై రాజుగా ఉన్నప్పుడు నువ్వు మా సంరక్షకుడుగా ఉన్నావు. ‘నువ్వు నా ప్రజలైన ఇశ్రాయేలీయులను పాలించి వారికి కాపరిగా ఉంటావు’ అని నిన్ను గురించి యెహోవా చెప్పాడు.” 3 ఇశ్రాయేలు గోత్రాల పెద్దలంతా హెబ్రోనులో ఉన్న తన దగ్గరికి వచ్చినప్పుడు రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిలో వారితో ఒప్పందం చేసుకున్నాడు. వారు తమపై రాజుగా ఉండేందుకు దావీదుకు పట్టాభిషేకం చేశారు.

4 దావీదు రాజైనప్పుడు అతని వయసు ముప్ఫై ఏళ్ళు. అతడు నలభై ఏళ్ళు రాజుగా పరిపాలన చేశాడు. 5 హెబ్రోనులో అతడు యూదా గోత్రం వారిని ఏడేళ్ళ ఆరు నెలలు, యెరూషలేములో ఇశ్రాయేలు, యూదా గోత్రాల ప్రజలను ముప్ఫై మూడు ఏళ్ళు పాలించాడు.

దావీదు యెరూషలేమును స్వాధీనం చేసుకోవడం
5:6-10; 1దిన 11:4-9
5:11-16; 1దిన 3:5-9; 14:1-7

6-7 దేశంలో యెబూసీయులు నివసిస్తూ ఉన్నప్పుడు వారిపై దాడి చేసేందుకు దావీదూ అతని మనుషులూ యెరూషలేముకు వచ్చారు. దావీదు తమపైకి రాలేడన్న ధీమాతో యెబూసీయులు “నువ్వు మాపైకి వస్తే ఇక్కడ ఉన్న గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు నిన్ను తోలివేస్తారు” అని దావీదుకు కబురు పంపారు. దావీదు వారిపై దండెత్తి దావీదుపురం అని పిలిచే సీయోను కోటను స్వాధీనం చేసుకున్నాడు.

8 ఆ సమయంలో దావీదు “దావీదు శత్రువులైన గుడ్డి, కుంటి యెబూసీయులపై దాడి చేయాలనుకునే వారంతా నీటికాలువ సొరంగం గుండా ఎక్కి వెళ్ళాలి” అన్నాడు. అప్పటినుండి “గుడ్డివారు, కుంటివారు యెహోవా మందిరంలోపలికి*యెహోవా మందిరంలోపలికి రాజభవనం రాలేరు” అనే సామెత పుట్టింది. 9 దావీదు ఆ పట్టణంలో కాపురం ఉన్నాడు. దానికి దావీదు పట్టణం అని పేరు పెట్టాడు. మిల్లో దిగువన దావీదు ఒక కోట కట్టించాడు. 10 దావీదు దినదినమూ వర్ధిల్లుతూ వచ్చాడు. సైన్యాలకు అధిపతి అయిన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు.

11 తూరు రాజు హీరాము తన మనుషులనూ, దేవదారు చెక్కలనూ, వడ్రంగం పనివారిని, భవనాలు కట్టేవారిని పంపించాడు. వాళ్ళు దావీదు కోసం ఒక పట్టణం కట్టారు. 12 ఇశ్రాయేలీయులపై రాజుగా యెహోవా తనను స్థిరపరిచాడనీ. దేవుడు ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసం తన రాజ్యాన్ని వర్థిల్లజేస్తాడనీ దావీదు గ్రహించాడు.

13 దావీదు హెబ్రోను నుండి వచ్చిన తరువాత యెరూషలేములో నివసించి అనేకమందిని ఉంపుడుగత్తెలుగా, భార్యలుగా చేసుకున్నాడు, దావీదుకు ఇంకా చాలామంది కొడుకులూ, కూతుర్లూ పుట్టారు. 14 దావీదు యెరూషలేములో ఉన్నప్పుడు అతనికి షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను, 15 ఇభారు, ఏలీషూవ, నెపెగు, యాఫీయ, 16 ఎలీషామా, ఎల్యాదా, ఎలీపేలెటు, అనేవారు పుట్టారు.

దావీదు ఫిలిష్తీయులను ఓడించడం
17 ప్రజలంతా ఇశ్రాయేలీయులపై రాజుగా దావీదుకు పట్టాభిషేకం చేశారని ఫిలిష్తీయులకు తెలిసినప్పుడు దావీదును చంపడానికి వారు సైన్యంతో బయలుదేరారు. ఆ వార్త తెలియగానే దావీదు సురక్షితమైన స్థలానికి వెళ్లిపోయాడు. 18 ఫిలిష్తీ సైన్యం వచ్చి రెఫాయీము లోయలో మకాం వేశారు. 19 దావీదు “నేను ఫిలిష్తీయులను ఎదుర్కొంటే వారిని నా చేతికి అప్పగిస్తావా?” అని యెహోవాకు ప్రార్థించాడు. అప్పుడు దేవుడు “బయలుదేరి వెళ్ళు, తప్పకుండా వాళ్ళని నీకు అప్పగిస్తాను” అని చెప్పాడు. 20 అప్పుడు దావీదు బయల్పెరాజీముకు వచ్చి అక్కడ వాళ్ళను ఓడించి “జలప్రవాహాలు కొట్టుకు పోయినట్టు యెహోవా నా శత్రువులను నా ముందు నిలబడకుండా చేశాడని” ఆ స్థలానికి బయల్పెరాజీము అని పేరు పెట్టాడు. 21 ఫిలిష్తీయులు తమ దేవుళ్ళ విగ్రహాలను అక్కడే విడిచిపెట్టి పారిపోయారు. దావీదు, అతని మనుషులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

22 ఫిలిష్తీయులు మళ్ళీ వచ్చి రెఫాయీము ప్రాంతంలో మాటు వేశారు. 23 దావీదు యెహోవాను ప్రార్థించినప్పుడు, యెహోవా అతనితో “నువ్వు వాళ్ళను తిన్నగా వెళ్లి ఎదుర్కోవద్దు. చుట్టూ తిరిగి వారి వెనుక నుండి కంబళి చెట్లకు ఎదురుగా వారిపై దాడి చెయ్యి. 24 కంబళి చెట్ల చుట్టూ తిరిగి వెళ్లి ఆ చెట్లకొమ్మల్లో వీచే గాలిలో శబ్దం వినిపించగానే ఫిలిష్తీయులపై దాడి చెయ్యి. ఎందుకంటే వారిని హతమార్చడానికి యెహోవా ముందుగా బయలుదేరుతున్నాడన్న మాట” అని చెప్పాడు. 25 యెహోవా తనకు చెప్పినట్టు చేసి, దావీదు గెబ నుండి గెజెరు వరకూ ఫిలిష్తీ సైన్యాన్ని తరుముతూ సంహరించాడు.

<- 2 సమూయేలు 42 సమూయేలు 6 ->