Link to home pageLanguagesLink to all Bible versions on this site
5
ప్రధాన కాపరి తిరిగి రానై యున్నందువల్ల క్రైస్తవ సేవ ఎలా ఉండాలి
1 తోటి పెద్దనూ, క్రీస్తు బాధలు చూసిన వాణ్ణి, ప్రత్యక్షం కాబోయే మహిమలో భాగస్వామినీ అయిన నేను మీలోని పెద్దలను హెచ్చరిస్తున్నాను. 2 మీ దగ్గరున్న దేవుని మందను కాయండి. బలవంతంగా కాకుండా దేవుడు కోరే రీతిగా ఇష్ట పూర్వకంగా వారిని చూసుకోండి. చెడు లాభం ఆశించి కాకుండా ఇష్టంగా వారిని చూసుకోండి. 3 మీ అజమాయిషీ కింద ఉన్న వారిపై పెత్తనం చేసేవారుగా ఉండక, మందకు ఆదర్శంగా ఉండండి. 4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, మీకు వాడిపోని మహిమ కిరీటం లభిస్తుంది.

5 యువకులారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరంతా ఒకరి పట్ల ఒకరు వినయం కలిగి ఉండండి. దేవుడు గర్విష్టులను ఎదిరించి వినయం గలవారికి కృప చూపుతాడు. 6 అందుచేత, దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించేలా ఆయన బలిష్ఠమైన చేతి కింద మిమ్మల్ని మీరే తగ్గించుకోండి.

7 ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. కాబట్టి మీ ఆందోళన అంతా ఆయన మీద వేయండి. 8 నిగ్రహంతో మెలకువగా ఉండండి. మీ శత్రువైన సాతాను, గర్జించే సింహంలా ఎవరిని కబళించాలా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. 9 వాణ్ణి ఎదిరించండి. మీ విశ్వాసంలో స్థిరంగా ఉండండి. లోకంలో ఉన్న మీ సోదరులకు కూడా ఇలాంటి బాధలే కలుగుతున్నాయి.

10 తన నిత్య మహిమకు క్రీస్తులో మిమ్మల్ని పిలిచిన అపార కరుణానిధి అయిన దేవుడు కొంత కాలం మీరు బాధపడిన తరువాత, తానే మిమ్మల్ని సరైన స్థితిలోకి తెచ్చి, బలపరచి, సామర్థ్యం ఇచ్చి స్థిర పరుస్తాడు. 11 ఆయనకే ప్రభావం శాశ్వతంగా కలుగు గాక. ఆమేన్‌.

12 సిల్వాను నా నమ్మకమైన సోదరుడని ఎంచి, అతని సాయంతో క్లుప్తంగా రాశాను. నేను రాసిందే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెబుతూ, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. దీనిలో నిలకడగా ఉండండి.

13 బబులోను పట్టణంలో ఉన్న ఆమె (దేవుడు ఎన్నుకున్న ఆమె) మీకు అభినందనలు చెబుతున్నారు. నా కుమారుడు మార్కు మీకు అభినందనలు చెబుతున్నాడు. 14 ప్రేమ ముద్దుతో ఒకరికొకరు అభినందనలు చెప్పుకోండి. క్రీస్తులో మీకందరికీ శాంతి కలుగు గాక.

<- పేతురు రాసిన మొదటి పత్రిక 4