Link to home pageLanguagesLink to all Bible versions on this site
2
(4) క్రీస్తు ఇచ్చిన వెల్లడింపు మానవ జ్ఞానానుసారమైనది కాదు. పౌలు దాన్ని ఉపయోగించుకో లేదు. ఆధ్యాత్మిక సత్యాలు మానవ వివేచనకు అందవు.
1 సోదరీ సోదరులారా, నేను మీ దగ్గరికి వచ్చి దేవుని మర్మం గూర్చి బోధించినప్పుడు మాటకారితనాన్నీ లేక గొప్ప తెలివినీ ఉపయోగించలేదు. 2 మీతో ఉన్న సమయంలో నేను యేసు క్రీస్తును తప్ప, అంటే సిలువను అనుభవించిన యేసు క్రీస్తును తప్ప, మరేదీ తెలియనివాణ్ణయి ఉండాలని తీర్మానించుకున్నాను. 3 బలహీనుడుగా, భయంతో, వణకుతూ మీ దగ్గర గడిపాను.

4 మీ విశ్వాసం మానవ జ్ఞానంపై కాక, దేవుని శక్తిపై ఆధారపడి ఉండాలని నా ఆశ. 5 అందుకే నేను మాట్లాడినా, సువార్త ప్రకటించినా, జ్ఞానంతో నిండిన తియ్యని మాటలు వాడక, పరిశుద్ధాత్మ శక్తినే ప్రదర్శించాను. 6 ఆధ్యాత్మిక పరిణతి గలిగిన వారికి జ్ఞానాన్ని బోధిస్తున్నాం. అది ఈ లోకానికి చెందిన జ్ఞానమూ కాదు, వ్యర్ధమైపోయే ఈ లోకాధికారుల జ్ఞానమూ కాదు. 7 అది దేవుని రహస్య జ్ఞానం. ఈ రహస్య జ్ఞానాన్ని దేవుడు ఈ లోకం ఉనికిలోకి రాక మునుపే మన ఘనత కోసం నియమించాడు.

8 దాని గురించి ఈ యుగానికి చెందిన లోకాధికారుల్లో ఎవరికీ తెలియదు. అది వారికి తెలిసి ఉంటే మహిమాస్వరూపి అయిన ప్రభువును సిలువ వేసేవారు కాదు. 9 దీన్ని గూర్చి ‘దేవుడు తనను ప్రేమించే వారికోసం ఏం సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మానవ హృదయం ఊహకు అందలేదు’ అని రాసి ఉంది. 10 మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా వెల్లడి చేశాడు. ఆ ఆత్మ అన్నిటినీ, చివరికి దేవుని లోతైన రహస్యాలను కూడ పరిశోధిస్తాడు.

11 ఒక వ్యక్తి విషయాలు ఆ వ్యక్తిలోని ఆత్మకే తెలుస్తాయి గానీ వేరొక వ్యక్తికెలా తెలుస్తాయి? ఆలాగే దేవుని విషయాలు దేవుని ఆత్మకు తప్ప మరెవరికీ తెలియవు. 12 దేవుడు మనకు ఉచితంగా దయచేసిన వాటిని తెలుసుకోవడం కోసం మనం లౌకికాత్మను కాక దేవుని నుండి వచ్చిన ఆత్మను పొందాము. 13 వాటిని మేము మానవ జ్ఞానం నేర్పగలిగే మాటలతో గాక ఆత్మసంబంధమైన విషయాలను ఆత్మసంబంధమైన వాటితో సరి చూసుకుంటూ, ఆత్మ నేర్పే మాటలతోనే బోధిస్తున్నాం.

వెల్లడి అయిన అంశాలు ఆత్మ సంబంధంగా మాత్రమే అర్థం అవుతాయి
14 సహజ సిద్ధమైన మనిషి దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు. ఎందుకంటే అవి అతనికి తెలివితక్కువగా కనిపిస్తాయి. వాటిని ఆధ్యాత్మికంగానే వివేచించగలం. కాబట్టి అతడు వాటిని గ్రహించలేడు. 15 ఆత్మ సంబంధి అన్నిటినీ సరిగా అంచనా వేయగలడు గాని అతణ్ణి ఎవరూ సరిగా అంచనా వేయలేరు. 16 ప్రభువు మనసు గ్రహించి ఆయనకు ఎవరు ఉపదేశించ గలరు? మనకైతే క్రీస్తు మనసు ఉంది.

<- కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 1కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 3 ->